ప్రశ్నాపత్రాల లీకేజీల కట్టడికి సిద్ధమైన ముసాయిదా చట్టం
నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం కేంద్ర ప్రభుత్వాన్ని కుదిపేస్తున్నది. కొన్ని నెలల క్రితం జరిగిన ఈ వ్యవహారం అనంతరం మళ్లీ నీట్ పరీక్షలు నిర్వహించడం, ర్యాంకర్లకు సీట్లు కేటాయించడం.. అన్నీ జరిగిపోవడంతో ఇక లీకేజీ ఉదంతం తెరమరుగైపోయినట్లేనని అందరూ భావిస్తున్న తరుణంలో ఉరుము లేని పిడుగులో సోషల్ మీడియా ప్లాట్ఫారంపై పురుడు పోసుకున్న కాక్రోచ్ జనతా పార్టీ ద్వారా మళ్లీ తెరపైకి వచ్చి ప్రకంపనలు సృష్టిస్తున్నది.
ఈ పార్టీని నిర్వాహకులు ప్రకటించినప్పుడు అదేదో ప్రభుత్వాలపై సెటైర్లు వేసి నాలుగు లైక్లు, షేర్లు పొందే పోస్టు అని అనుకున్నారు. కానీ అదే ఏకు మేకై దేశవ్యాప్తంగా జెన్ జడ్ తరాన్ని కార్యోన్ముఖులను చేసింది. దేశ రాజధాని వైపు నడిపించి.. ఉద్యమించేలా ప్రేరేపించింది. ఫలితంగా నరేంద్ర మోదీ నేతృత్వంలోని 12 ఏళ్ల ఎన్డీయే ప్రభుత్వం తొలిసారి ఇరకాటంలో పడింది. ఉద్యమానికి తలవంచినట్లు కనిపిస్తున్నది.

గత కొన్ని రోజులుగా లడ్డాఖ్కు చెందిన సోనమ్ వాంగ్చుక్ ఆమరణ నిరాహారదీక్ష చేపట్టడం, ఆయనకు మద్దతుగా అలాగే నీట్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ ఛలో పార్లమెంటుకు పిలుపునిచ్చింది. అయితే ఈ ఉద్యమంలో దేశవ్యతిరేక శక్తులు చొరబడ్డాయని, భారత్ను ముక్కలు చేయాలన్న లక్ష్యంతో విదేశీ శక్తులు దీన్ని తెర వెనుక నుంచి నడిపిస్తున్నాయని వార్తలు వచ్చాయి.
వాటిని బలపరుస్తూ ఆందోళనకారులు దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పాటు పార్లమెంటు భవనాన్ని ధ్వంసం చేస్తామని, దేశాన్ని మరో నేపాల్ చేస్తామని హెచ్చరించడం, కెనడా కేంద్రంగా పని చేస్తున్న ఖలిస్తానీ మద్దతుదారుడు, మనదేశ వాంటెడ్ లిస్టులో ఉన్న గురుపత్వంత్ సింగ్ పన్నున్ నీట్ ఉద్యమానికి రూ.పది కోట్లు ఇస్తానని ఆఫర్ చేసినట్లు వీడియోలు, వార్తలు వైరల్ కావడం తో.. ఇదేదో వేర్పాటువాదుల ప్రేరేపితమన్న అభిప్రాయాలు కూడా పెరిగాయి.

కానీ వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా ప్రశ్నపత్రాల లీకేజీ ఉదంతాల వల్ల యువతరం తీవ్రంగా నష్టపోతున్నదని గుర్తించిన దేశంలోని మేధావివర్గం, యువతరం ఢిల్లీ ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ప్రకటించడమే కాకుండా దానికి సంఘీభావంగా కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల పిలుపు మేరకు దేశంలోని అన్ని రాష్ట్రాలు, జిల్లాల్లో ఆందోళనలు ప్రారంభమయ్యాయి. మొదట్లో కేంద్రం దీన్ని తేలిగ్గా తీసుకుంది. సాయుధ పోలీసు బలగాలతో జంతర్ మంతర్ వద్ద తిష్ట వేసిన ఉద్యమకారులను చెదరగొడితే ఉద్యమం నిలిచిపోతుందని భావించింది. అయితే ఆ క్రమంలో సాయుధ బలగాలు లాఠీఛార్జీ చేయడం, పిల్లెట్లు ప్రయోగించడం, మహిళల పట్ల అమర్యాదగా వ్యవహరించడం వంటి ఘటనలు ఉద్యమానికి మరింత బలం చేకూర్చాయి. చెదిరిపోయిన ఆందోళనకారులందరూ మళ్లీ జంతర్మంతర్ను చుట్టుముట్టడంతో ప్రభుత్వం ఒక మెట్టు దిగిరాక తప్పలేదు. ఆ మేరకు కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్రసింగ్లు ఉద్యమకారుల ప్రతినిధులతో సుదీర్ఘ చర్చలు జరిపి వారి డిమాండ్లపై సంప్రదింపులు జరిపారు.

